
జూలూరుపాడు మండలంలో పారిశుధ్య కార్మికులకు కనీస రక్షణ పరికరాలు కరువు - చేతులకు ప్లాస్టిక్ కవర్లు చుట్టుకుని చెత్త ఎత్తుతున్న దుస్థితి - వర్షాకాలంలో అంటువ్యాధుల ముప్పు.. పట్టించుకోని అధికార యంత్రాంగం జూలూరుపాడు, సెప్టెంబర్ 01 : గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణ కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పటిష్టమైన చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చి చెత్తను నేరుగా డంపింగ్ యార్డులకు తరలించే వ్యవస్థను తెచ్చారు. అదే క్రమంలో పారిశుధ్య కార్మికుల శ్రమను గౌరవిస్తూ, వారి ఆరోగ్య భద్రత కోసం నాణ్యమైన గ్లౌజులు, మాస్కులు, గమ్ బూట్లు, యూనిఫామ్లతో పాటు నిత్యం సబ్బులు, కొబ్బరి నూనె, శానిటైజర్లను క్రమం తప్పకుండా పంపిణీ చేసేవారు. కానీ, నేడు పాలకులు మారడంతో పంచాయతీల్లో పారిశుధ్య వ్యవస్థ గాడి తప్పి, కార్మికుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారింది. రక్షణ కవచం లేక పారిశుధ్య కార్మికుల విలవిల జూలూరుపాడు మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో మొత్తం 83 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముసురు పట్టి వర్షాలు కురుస్తున్న వేళ, మురుగు కాల్వలు, చెత్తాచెదారాలను శుభ్రం చేయడానికి అవసరమైన కనీస భద్రతా సామగ్రిని అధికారులు సమకూర్చడం లేదు. గ్లౌజులు, కాళ్లకు బూట్లు, ముఖానికి మాస్కులు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక స్థానిక దుకాణాల్లో లభించే చిత్తు ప్లాస్టిక్ కవర్లను చేతులకు చుట్టుకుని, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎత్తిపారేయాల్సిన దుస్థితి దాపురించింది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్న సమయంలో, కనీసం చేతులు కడుక్కోవడానికి సబ్బులు, శానిటైజర్లు కూడా ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గాజు పెంకులు, సూదులు, కుళ్లిన వ్యర్థాలను చేతులతోనే తాకడం వల్ల తీవ్రమైన చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం