
రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు