
తొలగింపుపై వారంలో నిర్ణయం వెలువరించండి గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి దిల్లీ హైకోర్టు ఆదేశం దిల్లీ: యూట్యూబ్, ఆన్లైన్ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా, అసత్య ప్రచారంతో కూడిన వీడియోలను పోస్టు చేస్తుండడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ వీడియోలను తొలగించాలంటూ శిర్డీ సాయిబాబా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ)ని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం ఆదేశించింది. విషయ ప్రాధాన్యాన్ని గుర్తించి సాయిబాబా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను సత్వరమే పరిశీలించి సహేతుక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తన ఆదేశాల అమలు తీరును వివరిస్తూ తదుపరి విచారణ జరిగే ఈ నెల 19 తేదీలోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్ట నిబంధనలను అనుసరించి సామాజిక, ఆన్లైన్ మాధ్యమ వేదికలైన గూగుల్/యూట్యూబ్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ వీడియోలను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోలేదని శిర్డీ సాయిబాబా ట్రస్ట్ ఆరోపించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, జీఏసీలను ఆశ్రయించినప్పటికీ దుష్ప్రచారం, అసత్య ఆరోపణలతో కూడిన వీడియోలు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయని దిల్లీ హైకోర్టుకు సాయిబాబా ట్రస్ట్ తెలిపింది. విద్వేషకరమైన, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్న ఈ వీడియోలను తక్షణమే తొలగించేలా కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, గూగుల్, యూట్యూబ్లకు ఆదేశాలివ్వాలని సాయిబాబా ట్రస్ట్ కోరింది. దీనికి సంబంధించి తగు మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో