
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన కెరీర్లో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తనకు అలవాటైన మాస్ ఇమేజ్‌కు క్రమంగా దూరమవుతూ, తన వయసుకు తగ్గ పాత్రలు, కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న చిత్రమే ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘ఇరుముడి’ చిత్రం ట్రైలర్ బుధవారం విడుదల అయింది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో రవితేజను గతంలో కంటే భిన్నంగా, మరింత సహజమైన, తన వయసుకు తగ్గ పాత్రలో చూపించారు. కుటుంబం, భక్తి చుట్టూ సాగే కథ క్రమంగా యాక్షన్ వైపు మలుపు తిరుగుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో రవితేజ కొత్త లుక్, పాత్రలో కనిపించిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. తన మాస్ మహారాజా ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కొత్త తరహా పాత్రలను ఎంచుకోవాలనే రవితేజ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది
.