
Rashmika | టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ షూటింగ్ పూర్తయింది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో సందడి మొదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించనుండగా.. రష్మిక ఆయన భార్య జయమ్మగా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తికి తోడు.. తాజాగా విడుదలైన రష్మిక ప్రత్యేక వీడియో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ‘రణబాలి’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో రష్మిక కొత్త లుక్‌లో కనిపించారు. ముఖ్యంగా బేబీ బంప్‌తో ఉన్న ఆమె పాత్ర లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో రష్మిక.. విజయ్ దేవరకొండను ఆప్యాయంగా హత్తుకున్న దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో జయమ్మ పాత్రకు సంబంధించిన కీలకమైన సందర్భానికి ఇది సంబంధించినదా? అనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. అయితే ఈ లుక్ వెనుక కథ ఏమిటనేది మాత్రం చిత్రబృందం పూర్తిగా వెల్లడించలేదు. దీంతో జయమ్మ పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.షూటింగ్ పూర్తయిన సందర్భంగా రష్మిక కూడా భావోద్వేగంతో స్పందించారు. జయమ్మ పాత్ర చిత్రీకరణ పూర్తయిందని, సెట్లో ఆ పాత్రతో పాటు టీమ్‌ను మిస్ అవుతానని ఆమె పేర్కొన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ‘రణబాలి’, ‘జయమ్మ’ పాత్రల ప్రయాణం ముగిసిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పినట్లు చిత్రబృందం వెల్లడించింది. జయమ్మ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని విజయ్ అభిప్రాయపడ్డారు. జయమ్మ పాత్రపై దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేకంగా స్పందించారు. సినిమాలోని ప్రతి పాత్రను ఎంతో భావోద్వేగంతో తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు తన తల్లి పేరైన జయమ్మను పెట్టినట్లు దర్శకుడు వెల్లడించారు. నేటి తరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా ఈ పాత్రను రూపొందించినట్లు చెప్పారు.జయమ్మ పాత్రకు సంబంధించిన సంభాషణల విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకున్నామని, రష్మిక ఆ పాత్రకు పూర్తిస్థాయిలో ప్రాణం పోశారని రాహుల్ సంకృత్యాన్ ప్రశంసించారు. భవిష్యత్‌లో కూడా రష్మికను జయమ్మగానే ప్రేక్షకులు గుర్తుంచుకునేలా ఆమె నటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనుంది. ‘రణబాలి’ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. While writing #Ranabaali , I found myself walking down memory lanes for every little detail of its world. And when I sat down to write my female protagonist, I began with something deeply personal, I gave her my mother’s name. Through every emotion she goes through, I… pic.twitter.com/ILa6HKoGsr — Rahul Sankrityan (@Rahul_Sankrityn) September 13, 2026





