© 2026 nimisham.in

1,518 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులు అయోధ్య ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి వెల్లడి అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామ మందిరానికి 32.259 కేజీల బంగారం, 1,518.925 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. వీటితోపాటు 2,926 ఇతర విలువైన వస్తువులూ భద్రంగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్ర ఇక నుంచీ సభ్యులుగానూ కొనసాగబోరని స్పష్టం చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్ రావును తొలగించామని పేర్కొంది. మంగళవారం ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ఈ వివరాలను వెల్లడించారు. విరాళాల చోరీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను చంపత్ రాయ్ తీవ్రంగా ఖండించారు. సిట్ తుది నివేదిక వచ్చేవరకూ తాను మౌనవ్రతం పాటించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన స్వదస్తూరీతో హిందీలో భక్తులకు బహిరంగలేఖ రాశారు. ‘6వ తేదీన జరిగిన ట్రస్టు సమావేశంలో సిట్ ప్రాథమిక నివేదికను ప్రవేశపెట్టారు. ఆ నివేదిక ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. తుది నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో స్పందిస్తా. వరుస ఘటనలను వివరిస్తా’ అని లేఖలో రాయ్ తెలిపారు. నివేదిక రహస్యమైనా ట్రస్టు సమావేశంలో లీక్ కావడం గమనార్హమని వ్యాఖ్యానించారు. ట్రస్టువద్ద ప్రస్తుతం 30 కేజీలకుపైగా బంగారు, 1,518 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయి. బంగారంతో రూపొందించిన రామచరిత మానస్, డైమండ్ నెక్లెస్‌లను సోమవారమే కోశాధికారి మీడియాకు చూపించారు. వెండితో చేసిన చరణ్ పాదుకలనూ ప్రదర్శించారు. సోమవారం రాజీనామా చేసినప్పటి నుంచి చంపత్ రాయ్, అనిల్ మిశ్ర సభ్యులుగానూ లేరని గోవింద్ గిరి తెలిపారు. మరోవైపు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణ మోహన్‌ను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమించే అంశంపై ఈ నెల 22వ తేదీన జరిగే ట్రస్టు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్ర రాజీనామా
నేపథ్యంలో ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాల్ నగరకట్టే అలియాస్ గోపాల్ రావును తొలగించినట్లు గిరి తెలిపారు.
అయోధ్య విరాళాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలిచ్చింది. వీరిలో అనుకల్ప్ మిశ్ర, లవ్‌కుశ్ మిశ్ర, కరుణేశ్ పాండే ఉన్నారు. వీరితోపాటు మొత్తం 8 మందిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ గత నెల 29వ తేదీన కోర్టు తీర్పు ఇచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.