
గోదావరి పులసకు ఉన్న క్రేజ్ తరహాలోనే పులికాట్ రొయ్యలకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. సముద్రం నుంచి బ్యాక్‌వాటర్ ద్వారా పులికాట్ సరస్సులోకి వచ్చే ఈ రొయ్యలు ఉప్పునీరు, తియ్యటి నీరు కలిసే ప్రత్యేక వాతావరణంలో సహజసిద్ధంగా పెరుగుతాయి. ప్రత్యేకంగా సాగు చేయకుండా, సహజ ఆహారంతో పెరగడం వల్ల వీటికి ప్రత్యేకమైన రుచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభించే సీ ఫుడ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గోదావరి జిల్లాల్లో దొరికే పులస ఇందుకు మంచి ఉదాహరణ. సముద్రం నుంచి నదిలోకి వచ్చిన తర్వాత ఇలసగా, పులసగా మారే ఈ చేపకు ఉండే ప్రత్యేక రుచి కారణంగా భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పులసను తెప్పించుకుని తినేవారు ఉన్నారు.





