
ఇంటర్నెట్ డెస్క్: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన వారిని అక్కడి బిల్లులు మరింత భయపెడుతున్నాయి. టెస్టులు, స్కానింగ్‌లు, మందులు, రోగులకు గదుల పేర్లతో వేల రూపాయలు నిమిషాల్లో ఖర్చవుతుంటాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఖర్చు భారీగా ఉంటోంది. వీటిని కొంతైనా అరికట్టాలనే ఉద్దేశంతో పార్లమెంట్ ప్యానల్ నూతన ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. అందులో మెట్రోపాలిటన్ నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రి గది ఛార్జీ (hospital room cost).. త్రీ-స్టార్ హోటల్ గది (3star hotel room)కి ఉండే రేట్లను మించకూడదని సిఫార్సు చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం (Parliamentary Committee) నివేదికల ప్రకారం.. మహానగరాల్లోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో గది ఛార్జీలకు త్రీ-స్టార్ హోటల్ ఛార్జీల ప్రమాణాన్ని తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఏదైనా దీర్ఘకాలిక వైద్య చికిత్సను ప్రారంభించే ముందే.. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు అంచనా (Cost Estimation)ను రోగి కుటుంబానికి అందించాల్సిందిగా ఆసుపత్రులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతే కాకుండా చికిత్స ఖర్చులు, ఆరోగ్య హామీ పరిమితులపై రోగులకు అవగాహన కల్పించేలా ఆసుపత్రులు ప్రత్యేక ఆర్థిక సలహాదారులను నియమించాలని సూచించింది. అనారోగ్య సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ప్రతిసారి ఓ కుటుంబం సగటున చేసే ఖర్చు రూ.34,064గా ఉందని కమిటీ పేర్కొంది. ఖరీదైన క్యాన్సర్ చికిత్సలతో సహా అరుదైన వ్యాధుల చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) విరాళాలు, దాతృత్వ విరాళాలు, స్వచ్ఛంద గ్రాంట్లను సమీకరించాలని సూచించింది. వాటితో హెల్త్‌కేర్ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అధిక వ్యయంతో కూడిన చికిత్సల్లో సబ్సిడీ ఇవ్వడానికి ఈ నిధిని ఉపయోగించాలని పేర్కొంది. గ్రామీణ ఆసుపత్రులు, మొబైల్ డయాగ్నస్టిక్ యూనిట్లు, హెల్త్‌కేర్ సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరింది. ఔషధాల అత్యవసర రవాణా కోసం పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలని సిఫార్సు చేసింది. మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య క్లినిక్‌లను ప్రోత్సహించాలని సూచించింది. గమనిక