
గిద్దలూరు పట్టణం: గిద్దలూరు పురపాలకంలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ప్రజలకు కనీసం 3 రోజులకు ఒకసారైనా వాడుక నీరు అందించాలని ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం ఉదయం ఫిల్లింగ్ పాయింట్, నల్లబండ వీధిలో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నల్లబండ ప్రాంత ప్రజలు ట్యాంకర్లు రాక 9 రోజులైందని, ప్రైవేటు ట్యాంకర్ల వద్ద డ్రమ్ము నీటిని రూ. 60 వంతున కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోయారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 3 రోజులకు ఒక సారి నీరు అందించేలా చర్యలు చేఫడుతున్నామని అన్నారు. గిద్దలూరు ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ. 181 కోట్లు అందజేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు విడుదల చేశారని తెలిపారు. గొట్టిపడియ నుంచి కృష్ణా జలాలను గిద్దలూరుకు తీసుకువచ్చి ఏడాదిన్నర లోపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తెదేపా నాయకులు లొక్కు రమేష్, బిళ్లా రమేష్, మండ్ల శ్రీనివాసులు, మస్తా, గోపాల్ రెడ్డి, దుత్తా బాల ఈశ్వరయ్య పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.