
హైదరాబాద్, న్యూస్‌టుడే: గంజాయి కేసులో నిందితుడిని విడిపిస్తామంటూ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిందితులైన ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్ వివరాల ప్రకారం. ఈ నెల 8న అడ్డగుట్టకు చెందిన శివవర్మ గోవాలో డ్రగ్(ఎండీఎంఏ) సేవించి నగరానికి వస్తున్నట్లు నిఘా పెట్టిన ఈగల్ టీమ్ అతన్ని పట్టుకుని అదే రోజు సాయంత్రం కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పజెప్పింది. విచారణ పూర్తిచేసిన పోలీసులు అదే రోజు రాత్రి శివవర్మకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. విచారణ చేసే లోపే ఏపీలోని కోనసీమ అంబేడ్కర్ జిల్లా రావులపాలెంనకు చెందిన శివవర్మ సోదరి తమ సొంతూరుకు చెందిన ఉప్పలపాటి కాశీవిశ్వనాథరాజు, సయ్యపరాజు సురేశ్కుమార్లకు విషయం చెప్పింది. వీరందరూ కేపీహెచ్‌బీ పరిధిలోనే ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాశీవిశ్వనాథ రాజు, సురేశ్‌కుమార్‌లు తమకు పోలీస్‌శాఖలో ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయంటూ శివవర్మ సోదరిని నమ్మించారు. కేసు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రూ.2లక్షలు డిమాండ్ చేశారు. తమ్ముడి భవిష్యత్తు కోసం ఆమె రూ.1.70లక్షలు బదిలీ చేసింది. వారి పైరవీతోనే తమ్ముడు ఇంటికి వచ్చాడని ఆమె అనుకుంది. ఇంటికి చేరిన శివవర్మకు డబ్బుల విషయం చెప్పడంతో అదేమీ లేదని చెప్పడంతో వారు మోసం చేశారని ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి సదరు నగదును స్వాధీనం చేసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు