
ఆరేళ్లుగా గతుకుల్లోనే గిరిజనుల రాకపోకలు గత ప్రభుత్వం నిధుల మళ్లింపుతో ఇబ్బందులు పూర్తికాని నరసాపురం-కన్నారం రోడ్డు న్యూస్‌టుడే, రంపచోడవరం: తమ గ్రామాలకు పక్కా రహదారులు మంజూరయ్యాయని గిరిజనులు ఎంతో సంతోషపడ్డారు. పనులను ప్రారంభించిన తర్వాత అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరాశకు గురయ్యారు. రాళ్లదారిపై రాకపోకలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2020, 2021లో గత ప్రభుత్వ హయాంలో బీటీ రహదారుల నిర్మాణానికి పంచాయతీరాజ్‌ (ప్రాజెక్టు) ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లను తవ్వేసి కంకర పోసిన తరువాత నిధులను సంక్షేమ పథకాల పేరుతో మళ్లించడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆరేళ్లు దాటుతున్నా నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్, తదితర వాహనాలు రాక నరకయాతన పడుతున్నారు. పనుల ప్రారంభానికి చర్యలు.. - రమేష్, డీఈ, పంచాయతీరాజ్‌ (ప్రాజెక్టు), రంపచోడవరం నిలిచిపోయిన రహదారుల పనులను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. సోకులగూడెం గ్రామ సమీపంలో కల్వర్టు శిథిలం కావడంతో అంబులెన్స్‌ కూడా వెళ్లలేని పరిస్థితి ఉన్నందున తొలుత అక్కడ పనులు చేపడతాం. మిగిలిన రోడ్ల పనులకు గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులపై ఉన్నతాధికారులతో చర్చించాం. త్వరలో ఆయా రహదారుల నిర్మాణాలు మొదలుపెడతాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.