
Pithapuram Panchayat Raj Ae Family Jumps Into Godavari River
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, ఒక బాలుడిని స్థానికులు రక్షించారు.వివరాల్లోకి వెళితే.. పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి నిన్న అర్ధరాత్రి రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి, నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు. అయితే, నూకరాజు, మీనా, సౌజన్య నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న నూకరాజు, కుటుంబంతో కలిసి ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.





