© 2026 nimisham.in

ఇల్లు కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. రుణం తీసుకుంటే, అది దీర్ఘకాలిక బాధ్యతగా మారుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు అటువంటి నిర్ణయం తీసుకునే ముందు పీఎఫ్‌పై రుణం తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఇంటి లోన్/డౌన్ పేమెంట్ కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం 'ప్రావిడెంట్ ఫండ్' బ్యాలెన్స్‌ను ఉపయోగించడం. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, లేదా ఇంటి డౌన్ పేమెంట్ కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి EPF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం PF నుంచి డబ్బు తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుందా, అవ్వదా అనే నిర్ణయాన్ని పీఎఫ్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీం, 1952(EPF పథకం)లోని సెక్షన్ 68B ప్రకారం, నిర్దిష్ట షరతులకు లోబడి, ఎవరైనా ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా స్థలంపై ఇల్లు నిర్మించడానికి తన EPF ఖాతాలోని బ్యాలెన్స్‌ను తీసుకోవచ్చు. ఇల్లు కొనడానికి ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ PF నిల్వలో 90 శాతాన్ని తీసుకోవచ్చు. ఇల్లు మీ పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గృహ రుణం కోసం PF డబ్బును ఉపయోగించవచ్చు. గృహ రుణం కోసం PF డబ్బును విడతల వారీగా తీసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోపు పూర్తి కావాలి. గృహ నిర్మాణం కోసం పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడంలో లాభ, నష్టాలు లేకపోలేదు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ PF పొదుపును ఉపయోగించడం ద్వారా మీ రుణ మొత్తాన్ని లేదా నెలవారీ EMIలను తగ్గించుకోవడానికి నిధులు లభిస్తాయి. ఇది PF నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో ఒకటి. ఇది మీరు త్వరగా ఇల్లు కొనుగోలు చేయడానికి, మీ కుటుంబానికి దీర్ఘకాలిక
స్థిరత్వాన్ని కల్పించడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఇంటికి సంబంధించిన దానిలో పెట్టుబడి పెట్టడానికి మీ PFను ఉపయోగిస్తున్నందున, ఇది మీకు ఆస్తులను, భద్రతను సృష్టించడంలో సహాయపడుతుంది. PF మొత్తంపై పొందే రాబడితో పోలిస్తే ఆస్తి ధరల్లో పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటే, ఈ ఉపసంహరణ నిర్ణయం లాభదాయకమే అని చెప్పవచ్చు. అన్నిటికన్నా, పీఎఫ్‌లో ఉండేది మీ డబ్బే కాబట్టి, దాని ఉపసంహరణకు ఎలాంటి రుసుములు/వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
మీ PF ఖాతా నుంచి ముందుగానే డబ్బు తీసుకోవడం వల్ల మీ పదవీ విరమణ నిధి తగ్గిపోతుంది, చక్రవడ్డీ కోల్పోతారు. మీరు తీసుకునే సమయాన్ని బట్టి, TDS వంటి పన్ను కోతలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, PF నుంచి డబ్బు తీసుకోవడానికి నిర్దిష్ట నియమాలు/పరిమితులు ఉన్నందున, అవి ప్రతి రుణగ్రహీతకు సరిపోకపోవచ్చు. మీ పదవీ విరమణ తర్వాత PF మీకు భద్రతను అందిస్తుంది. కాబట్టి, దాన్ని ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉంచి, దాని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆస్వాదించడం వివేకం. సరైన నిర్ణయం తీసుకోవడానికి, మీరు ఒక ఆర్థిక సలహాదారు నుంచి సలహాను పొందడం మంచిది.
EPF మీకు పన్ను రహిత వడ్డీ(ప్రస్తుతం 8.25%)ను అందిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న గృహ రుణ వడ్డీ రేటు(సుమారు 8%) కంటే ఎక్కువ. మీ పీఎఫ్(పదవీ విరమణ పొదుపు)ను తాకకుండా మీ గృహ రుణ డౌన్ పేమెంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఈ PF ఉపసంహరణ ప్రత్యామ్నాయాలను పరిగణించవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫండ్ల రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి, వీటిపై రుణం కానీ, ఖాతాలను ఉపసంహరించుకుని కానీ, ఇంటి కొనుగోలుకు ఉపయోగించొచ్చు. కానీ, దీన్ని ఒక వ్యూహంగా కాకుండా, కేవలం ఒక ఆప్షన్‌గా మాత్రమే పరిగణించండి. మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వంటి ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే EPF రాబడి ఎక్కువగా ఉన్నట్లయితే, డౌన్ పేమెంట్ కోసం ఇతర మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకోవడం మంచిది.
చివరిగా: ఇంటి కొనుగోలు కోసం PF ఉపసంహరణ నిధులను సమకూర్చుకోవడానికి ఒక శీఘ్ర మార్గం అయినప్పటికీ, దీన్ని అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి, డౌన్ పేమెంట్ వంటి అవసరాల కోసం ఇతర ఆర్థిక వనరుల లభ్యతను పరిశీలించిన తర్వాతే PF నుంచి డబ్బు తీసుకోవడాన్ని చివరి ప్రత్యామ్నాయంగా పరిగణించడం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.