
జనసేన పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేస్తోంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2న 'జనసేన యువజన విభాగం'ను అధికారికంగా ఆవిష్కరించనుంది. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా, "దేశమే ఫస్ట్" అనే నినాదంతో ఈ విభాగం పనిచేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో బుధవారం జరగనున్న ప్రధాన కార్యక్రమ ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు ఇదొక పండుగ రోజు అని మనోహర్ అభివర్ణించారు. పిఠాపురం వేదికగా యువజన విభాగానికి సంబంధించిన ప్రత్యేక లోగో, గీతం, ఆడియో విజువల్‌ను ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఈ ప్రధాన కార్యక్రమంతో పాటు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ యువజన విభాగం ఆవిష్కరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. పోలీసుల అనుమతితో బైక్ ర్యాలీలు చేపడతారని, పిఠాపురంలో జరిగే కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని వివరించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక సందేశం ఇస్తారని భావించినప్పటికీ, అది సాధ్యపడకపోవచ్చని మనోహర్ స్పష్టం చేశారు. "ప్రస్తుతం పవన్ కల్యాణ్ గారు కేరళలో చికిత్స పొందుతున్నారు. అక్కడి సాంకేతిక సమస్యల కారణంగా రేపటి కార్యక్రమంలో ఆయన సందేశం ఉండకపోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు, మహిళలకు జనసేన ప్రాధాన్యం ఇస్తుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు