కొండపై దూకేందుకు యత్నించిన తమ కుమారుడ్ని రక్షించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం తీవ్ర విషాదంగా ముగిసింది. ముగ్గురు లోతైన క్వారీలో పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషాదకర ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దేవలాయ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుటుంబ విబేధాల కారణంగా శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖవ్డా డోంగర్ పైభాగానికి చేరుకుని కొండ అంచున నిలబడ్డాడు. దీనిని గమనించిన అతడి తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడికి నచ్చజెప్పి వెనక్కి తీసుకురావడానికి దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించారు.సేఫ్టీ నెట్‌ను అగ్నిమాపక సిబ్బంది కింద సిద్ధంగా ఉంచినప్పటికీ, యువకుడు మాత్రం వినకుండా ప్రమాదకరమైన అంచుపైనే తిరుగుతూ కిందకు దూకుతానని బెదిరించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ యువకుడు ఒక్కసారిగా క్వారీలోకి జారిపడ్డాడు. వెంటనే అతడ్ని పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించిన తండ్రి, కంగారులో ఆయన కూడా పట్టుతప్పి లోయలో పడిపోయారు. భర్త, కొడుకు కళ్లముందే లోయలో పడిపోవడం చూసి తట్టుకోలేకపోయిన ఆమె.. కూడా మరుక్షణమే ఆ క్వారీలోకి దూకేసిందని మాజీ తిస్గావ్ సర్పంచ్ సంజయ్ జాధవ్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.‘‘మొదట్లో కింద నుంచి తన కొడుకును బతిమాలుతున్న తండ్రి... చివరి 15-20 నిమిషాల్లో కొండ పైకి ఎక్కాడు. ఆ యువకుడు అంచుకు దగ్గరగా వెళ్తూ ఉండటంతో, తండ్రి అతడిని అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మధ్యాహ్నం సుమారు 1 గంటకు.. తన కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి కొండపై నుంచి కిందపడిపోయారు. కొద్దిసేపటికే, తీవ్ర భయాందోళనకు గురైన తల్లి కూడా కొండపై నుంచి కిందపడిపోయింది... పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా ఆ బాలుడిని అంచు నుంచి దూరంగా వెళ్ళమని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి...తల్లిదండ్రులు, ఇతరులు యువకుడికి నచ్చజెప్పడానికి పదేపదే ప్రయత్నించారు’’ ప్రత్యక్ష సాక్షి సంజయ్ జాదవ్ తెలిపారు.









