
Oil Tanker Hits Auto On National Highway 65 Satwar Zaheerabad In Sangareddy District
సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో.. అతి వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది.
సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో.. అతి వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. అయితే హైవేపై యూటర్న్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి ప్రాంతానికి చెందిన కూలీలు.. వ్యవసాయ పనుల కోసం వచ్చి తిరిగి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. వీరు నిత్యం వ్యవసాయ కూలి పనుల కోసం జహీరాబాద్ సహా పరిసర ప్రాంతాలకు వస్తుంటారని స్థానికులు వెల్లడించారు. రోజూ లాగే మంగళవారం కూడా పనులు ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్.. సత్వార్ సమీపంలో కూలీల ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయిల్ ట్యాంక్ ఢీకొన్న వేగానికి ఆటోలోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతోపాటు పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న కూలీలు హైవేపై ఎగిరి పడ్డారు. సంఘటనా స్థలంలో రక్తం ఏరులై పారింది. గాయపడ్డ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారిపోయింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ఎన్‌హెచ్-65పై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాలను ముందుకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందినవారు కావడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలోని మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద అదే నేషనల్ హైవే-65పై డివైడర్‌ను ఢీకొన్న కారు అవతలి వైపునకు ఎగిరిపడింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న 4 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.





