
రాయగడ గ్రామీణం: రాయగడ జిల్లా కల్యాణసింగ్‌పూర్ సమితి సింగారి పంచాయతీలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పాలఖమణ, టి.క్రాపడ, పాద్రుగుడా, టిడిమస్కా సమీపంలోని అడవుల్లో 13 ఏనుగులతో కూడిన గుంపు మకాం వేసింది. ఈ గుంపులో రెండు పిల్ల ఏనుగులు కూడా ఉన్నాయి. అడవి నుంచి బయటకు వచ్చి వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశిస్తున్న ఏనుగులు.. చేతికొచ్చిన పంటను తినడంతో పాటు తొక్కి, ధ్వంసం చేస్తున్నాయి. ఈ నెల 11 నుంచి ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలోనే ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ఏనుగుల భయంతో గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకి రావడానికి భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ సహాయంతో ఏనుగుల గుంపును సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు పరిహారం అందించడంతో పాటు ఏనుగుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.