© 2026 nimisham.in
ఇంటర్నెట్‌డెస్క్: అయోధ్య విరాళాల చోరీకి సంబంధించి జరుగుతోన్న దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి (Ram Temple theft case). రామాలయ విరాళాల కౌంటింగ్ కేంద్రాల నుంచి రూ.500 నోట్లతో మొదలైన ఈ చేతివాటం.. తర్వాత కట్టలకొద్దీ తస్కరించే వరకూ వెళ్లిందని సిట్ గుర్తించింది. ఆ మొత్తం రూ.2-3 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. సీసీటీవీ నిఘా, భద్రతా నిబంధనల్లోని లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని వెల్లడించింది. ఆలయ (Ayodhya Ram Mandir) విరాళాల లెక్కింపు ప్రక్రియలో భాగమైన రెండు మూడు నెలలకే ఆరుగురు సిబ్బంది చేతివాటం మొదలుపెట్టారని, తొలుత కరెన్సీ నోట్లను జేబులో వేసుకున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తమ దుస్తుల్లో ఆ నోట్లను దాచుకొని, బయటకు తీసుకెళ్లినట్లు నిందితులు అంగీకరించారు. తమ దొంగతనాలను ఎవరూ గుర్తించకపోవడంతో క్రమంగా ఆ నోట్ల సంఖ్య పెరిగింది. కౌంటింగ్ దగ్గర ఉన్న ఆ సిబ్బంది కలిసి మొత్తం రూ.2-3 కోట్లు చోరీ చేశారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నగదు తీయడం వారికి సులభమైంది. విరాళాల సేకరణ, లెక్కింపు, బ్యాంక్‌లో జమ విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థట్రస్ట్, ఎస్బీఐ మధ్య ఒప్పందం ఉంది. దీని ప్రకారం.. విరాళాల బాక్సులను ట్రస్ట్, ఎస్బీఐ ప్రతినిధుల ఆధ్వర్యంలో తెరవాలి. ప్రతి డొనేషన్ బాక్స్‌లోని నగదును విడిగా లెక్కించాలి. సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. వారు యూనిఫామ్‌లోనే ఉండాలి. కౌంటింగ్ గదిలోకి వ్యక్తిగత వస్తువులు ఏవీ తీసుకురాకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ తప్పనిసరి. అయితే వీటిలో పలు నిబంధనలు సరిగా అమలుకావడం లేదని సిట్ గుర్తించింది. అలాగే అవినాశ్ శుక్లాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించాయని వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా
సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.