
నెల్లూరు (నగర పాలక సంస్థ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ మొత్తాన్ని అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. మంగళవారం నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ రాగానే రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. గత ప్రభుత్వంలా వాయిదాల పద్ధతిలో కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారుల పింఛన్లను ఒకేసారి రూ.4 వేలకు పెంచి అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల కోసం రూ.73,594.44 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలు, బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు