
తినదగినవాటిలో శక్తివంతమైన వాటిని తినాలనే ధ్యాస, వండాలనే తపన ఉండాలే గానీ, కూరగా వండుకోవటానికి పనికిరాని దేదీ లేదు... ఆఖరికి వేప చిగురు కూడా! చిగురాకుల్లో వేపచిగురు శక్తివంతమైంది. అమృతానికి వేపచిగురు మారుపేరు. ప్రకృతి సంపదలో ఆహార యోగ్యమైన ఔషధాలను వంటగదిలోకి తెచ్చిన పాకశాస్త్ర కోవిదుడు నలుడు. మేడికాయలతోనూ కలబందతోనూ, వేపచిగుళ్లతోనూ ఆఖరికి జిల్లేడాకులతో కూడా ఆయన ఆరోగ్యదాయక వంటకాలను చేసి చూపించాడు. వేప సర్వరోగనివారిణి అని ఇవ్వాళ కొత్తగా చెప్పాల్సింది లేదు. లేత వేపచిగుళ్లలో చేదు తక్కువగా ఉండటమే కాకుండా తేలికగా అరిగేదిగా ఉంటుంది. చలవ నిస్తుంది. జఠరాగ్ని పెంచుతుంది. తద్వారా షుగర్స్, కొవ్వు పదార్థాలు తేలికగా వంటబట్టి శరీరానికి శక్తిగా మారతాయి. దప్పిక తీరుస్తాయి. దగ్గు, కఫాలను ఆపుతాయి. జ్వరాన్ని నివారిస్తాయి. నోటికి అన్నహితవుని కలిగిస్తాయి. సూక్ష్మజీవుల దోషాలను పోగొడతాయి. అల్సర్లు త్వరగా మాడేలా చేస్తాయి. వాంతి వికారాలను తగ్గిస్తాయి. అతిసార వ్యాధి ఏర్పడినప్పుడు విరేచనం నీటి శాతాన్ని తగ్గించి శోషరాకుండా కాపాడతాయి. చర్మరోగాలను, ఎలర్జీవ్యాధులను పోగొడతాయి. షుగరు వ్యాధికి శత్రువుగా పనిచేస్తాయి. ఇంతకన్నా ఏం కావాలి...? ‘‘త్రిదోషశమనం పథ్యం సర్వవ్యాధిహరం శుభమ్’’ ఒక గొప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే అన్ని దోషాలనూ వ్యాధులనూ తగ్గించటమే కాదు, అవి రాకుండా కూడా కాపాడుతుందంటాడు నలుడు. ‘శుభం’ అనటం ద్వారా వేపచిగుళ్లను తినటం అనేది మంగళకరమైన శుభప్రదమైన అంశంగా పేర్కొన్నాడు. సర్వ పాపహరం అనటం లాంటిది. వేపచిగుళ్ల కూర: లేత వేపచిగుళ్లలోని ఈనెలు, కాడలు తొలగించి సన్నగా తరిగి ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. వాటితో పాటు కొద్దిగాగలిజేరు (పునర్నవ- అటికమావిడి) ఆకులు, లేదా కామంచికాయలు, లేదా పత్తి ఆకులు కలిపి అరగంట నానబెట్టి, తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి తాలింపు ద్రవ్యాలు వేసి, ఈ ఆకులన్నింటినీ మెల్లగా మగ్గించాలి. తరువాత ఇష్టమైన సంబారాలను నూరి కలిపి కొద్దిసేపు ఉమ్మగిల్లనివ్వాలి