© 2026 nimisham.in

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ తన దక్షిణ కొరియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. వారం రోజుల పాటు సియోల్‌లో జరిగిన ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు."కొరియన్ల స్ఫూర్తితో 'పల్లి పల్లి' (త్వర త్వరగా) పద్ధతిలో చర్చలు, భాగస్వామ్యాలపై దృష్టి సారించాం. భవిష్యత్తుకు సంబంధించిన ఉమ్మడి దార్శనికతతో ఈ పర్యటన సాగింది" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. తన పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన దక్షిణ కొరియా విదేశాంగ శాఖ, సియోల్‌లోని భారత రాయబార కార్యాలయం, ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్ (EDB) బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. "మళ్లీ కలుద్దాం సియోల్... అంతవరకు కమ్సహమ్నిదా!" అంటూ కొరియన్ భాషలో పోస్ట్‌ను ముగించారు. కమ్సహమ్నిదా అనేది కొరియన్ భాషా పదం. ఎవరికైనా అత్యంత మర్యాదపూర్వకమైన రీతిలో కృతజ్ఞతలు తెలిపేటప్పుడు ఈ పదం (కమ్సహమ్నిదా) ఉపయోగిస్తారు. అన్నట్టు... టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'లో కూడా 'కమ్సహమ్నిదా' పేరుతో ఓ సాంగ్ ఉంది. ఈ పాట రిలీజైనప్పుడు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది
.