
‘తం డేల్‌’ చిత్రంతో విజయాన్ని అందుకున్న కథానాయకుడు నాగచైతన్య.. ఇప్పుడీ సినిమాలోని నటనకు గానూ ఉత్తమ నటుడిగా సైమా పురస్కారాన్ని అందుకున్నారు. ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంపికవ్వగా.. ఇదే చిత్రానికి గానూ ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా సైమా అవార్డును గెలుచుకున్నారు. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా అవార్డ్స్‌ - 2026) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగాయి. తారల తళుకు బెళుకుల మధ్య రెండు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈసారి సైమాలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఏకంగా ఆరు పురస్కారాల్ని సొంతం చేసుకుని సత్తా చాటింది. ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన ఈ చిత్రంతో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా వెంకటేశ్, ఉత్తమ దర్శకుడిగా అనిల్‌ రావిపూడి, ఉత్తమ నేపథ్య గాయకుడిగా రమణ గోగుల, ఉత్తమ హాస్య నటుడిగా రేవంత్‌ (బుల్లిరాజు) పురస్కారాలు అందుకున్నారు. ‘మిరాయ్‌’ ఉత్తమ చిత్రంగా నిలవడమే గాక దీనికి గానూ ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్‌) తేజ సజ్జా, ఉత్తమ ప్రతినాయకుడిగా మంచు మనోజ్, ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని సైమా అవార్డులు గెలుచుకున్నారు. ‘తండేల్‌’ సినిమాతో చందూ మొండేటి ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌)గా.. ‘డాకు మహారాజ్‌’తో శ్రద్ధా శ్రీనాథ్‌ ఉత్తమ సహాయ నటిగా, ‘కింగ్డమ్‌’తో సత్యదేవ్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు సాధించారు. ఇక కథానాయకుడు నాని నిర్మాణం నుంచి వచ్చిన ‘కోర్ట్‌’ సైమాలో నాలుగు పురస్కారాలతో సత్తా చాటింది. ఈ చిత్రానికి గానూ హర్ష్‌ రోషన్‌ ఉత్తమ పరిచయ నటుడు, శ్రీదేవి ఉత్తమ పరిచయ నటి, పూర్ణాచారి ఉత్తమ గేయ రచయిత, సమీరా భరద్వాజ్‌ ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులు అందుకున్నారు. అలాగే ‘మోగ్లీ’తో తెలుగులోకి అరంగేట్రం చేసిన సాక్షి మడోల్కర్‌ ఉత్తమ పరిచయ నటిగా సైమాని సొంతం చేసుకుంది. ఇక కన్నడ చిత్రసీమ నుంచి ‘కాంతార: ఛాప్టర్‌ 1’కి గానూ రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికవ్వగా.. ‘సు ఫ్రమ్‌ సో’ సినిమాతో జేపీ తుమినాడ్‌ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడుగా అవార్డులు అందుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.