
కుకింగ్ షో అయినా రియాల్టీ షో అయినా ఏ షో అయినా సరే దానికంటూ ఓ టీం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని షోల్లో కొన్ని సార్లు వీళ్లే ఎందుకు గెలిచారు? వీళ్లని ఎందుకు ఎలిమినేట్ చేశారు.. అనేది చెప్పడం కష్టమే అవుతుంది. ఆడియెన్స్ ఓటింగ్ అయినా, జడ్జ్‌ల జడ్జ్మెంట్ అయినా కూడా షోని నిర్వహించే టీం పక్కన పెట్టేయగలదు. అందుకే ఈ మధ్య ఏ షోలో ఎవరు గెలిచినా కూడా కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ విన్నర్ మీద చర్చ మొదలైంది. తనూజ దాదాపు విన్నర్ అని సీజన్ ఆరంభంలోనే అందరికీ అర్థమైంది. ఆషిక, డెమాన్ పవన్, నిఖిల్, రాకేష్ వంటి వారు కూడా అద్భుతంగా వంటలు వండేవారు. టాప్ 5లో వీరంతా ఉండటానికి అర్హులే. అయితే తనూజను విన్నర్‌ని చేయడంతో కొంత మంది స్టార్ మా ముద్దు బిడ్డ కదా.. విన్నర్‌ని చేస్తారులే అని కామెంట్లు చేశారు. కానీ తనూజ కూడా తన కుకింగ్‌తో ప్రతీ వారం టాప్‌లో నిలుస్తూ వచ్చింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆషిక కూడా అదరగొట్టేసింది. కానీ చివరకు వచ్చిన రౌండ్లో తనూజ, డెమాన్ పవన్ టాప్ 2 ప్లేస్‌లోకి వచ్చారు.ఇక విన్నర్‌గా తనూజను ప్రకటించేశారు. అదంతా ముగిసింది. కానీ జడ్జ్‌ల్లో ఒకరైన ముచ్చర్ల అరుణ రియల్ విన్నర్ డెమాన్ పవన్ అని ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఎంత వేగంగా డిలీట్ చేసినా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే వైరల్ అవుతాయి. ముచ్చర్ల అరుణ అలా పోస్ట్ వేసి డిలీట్ చేయడంతో అందరికీ అనుమానం మొదలైంది. తనూజ రియల్ విన్నర్ కాదా? ఆమెను కావాలనే గెలిపించారా? అని అంతా అనుకోవడం ప్రారంభించారు. అయితే ముచ్చర్ల అరుణ మాత్రం డ్యామేజ్ కంట్రోల్‌కి ప్రయత్నించింది.నన్ను క్షమించండి.. దాని క్యాప్షన్ చూడకుండా రీ పోస్ట్ చేశాను.. అని అరుణ మరో పోస్ట్ వేసింది. ఆ తర్వాత తనూజ విన్నింగ్ మీద ఇంకో పోస్ట్ వేసింది. కానీ అప్పటికే వార్ మొదలైంది. తనూజ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఈ విన్నింగ్ ఎపిసోడ్ మీద చర్చలు, ట్రోలింగ్లు స్టార్ట్ చేశారు. మరి వీటిపై షో నిర్వాహకులు గానీ, తనూజ గానీ, డెమాన్ పవన్ గానీ, ఇతర జడ్జ్‌లు గానీ రియాక్ట్ అవుతారా? లేదా? అన్నది చూడాలి. ముచ్చర్ల అరుణ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చేసిన పోస్ట్ మాత్రం మరింతగా వైరల్ అవుతోంది.