Aug 13 2026 9:13 AM | Updated on Aug 13 2026 9:13 AM
మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది.
మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులు దైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి:
‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్‌కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది.
సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనం ప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్‌లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది.
ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు; అది మనిషి తాను పుట్టిన నేలతో ఏర్పరుచుకునే ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధం. రోజువారీ ఫర్జ్ నమాజుల్లోనే కనీసం 34 సార్లు (సున్నత్, నఫిల్, వాజిబ్ లు కాక) తన నుదుటిని నేలకు ఆనించడం ద్వారా విశ్వాసి మాతృభూమి మట్టితో విడదీయరాని ఐక్యతను చాటుకుంటాడు. మట్టి నుండి పుట్టిన మనిషి, నిరంతరం ఆ మట్టికే ప్రణమిల్లడం వల్ల ఆ నేల పట్ల భక్తి, గౌరవం, రక్షణ భావం అతని నరనరాల్లో ఇంకిపోతాయి. మాతృభూమి మట్టిని పదే పదే తాకే ఆ శిరస్సు ఏ పరాయి దాస్యానికీ లొంగదు; ఆ నేల స్వేచ్ఛకోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడదు. చరిత్రే దీనికి సాక్ష్యం.
త్యాగానికి మూలమైన ఆధ్యాత్మిక నిరూపణ సజ్దాలో దైవానికి లొంగిన ఆత్మ, ప్రపంచంలో మరే శక్తికీ బానిస కాజాలదు. అందుకే, ఏ నేలనైతే రోజువారీ సజ్దాలతో పునీతం చేస్తాడో, ఆ నేల స్వేచ్ఛకు ముప్పు వాటిల్లితే ముస్లిం సమాజం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం యోధులు చిందించిన ప్రతీ రక్తపుబొట్టు వెనుక, దైవప్రవక్త నేర్పిన జన్మభూమి ప్రేమ, నమాజ్‌లో చేసిన ప్రతీ సజ్దా అందించిన ఆత్మబలమే నిలిచి ఉన్నాయి. జన్మభూమిని ప్రేమించడం, దాని స్వేచ్ఛ కోసం పోరాడటం కేవలం రాజకీయ బాధ్యత కాదు; అది విశ్వాసి నైజంలోనే కలిసిపోయిన పరమసత్యం. – మదీహా అర్జుమంద్ ఖాన్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు)
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
పరారే పరారే.. పరిశ్రమలు పరారే.. బాబు దెబ్బకు కంపెనీలు టాటా.. బైబై..!
MLC భరత్ తల్లిపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన BJP నేత
DSC స్కామ్ నుంచి డైవర్ట్ చేసేందుకు.. భారతి సిమెంట్స్ పై బాబు కుట్ర
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
నా కూతురిని చంపిన వాడికి సహాయం చేస్తే.. చంద్రబాబు గుర్తుపెట్టుకో.. ప్రియాంక తండ్రి స్ట్రాంగ్ వార్నింగ్