వచ్చాక అడవుల్లో సాయుధ నక్సలైట్లను అంతమొందించాం. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాం. మనం సాయుధ నక్సల్స్‌ను అంతమొందించాంగానీ మేధో నక్సల్స్ ఇంకా పొంచి ఉన్నారు. హింస, అరాచక దారుల కోసం ఈ నక్సల్స్ అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు దారిలోకి లాగడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అందువల్ల ఈ మేధో నక్సలైట్లను గుర్తించి ఏకాకులను చేయాలి. దేశాభివృద్ధి ప్రధాన స్రవంతిలో యువతను భాగస్వాములను చేయాలి’’ అని పిలుపునిచ్చారు. గతంలో అర్బన్ నక్సల్స్ అని ప్రస్తావించిన ప్రధాని ఈసారి మేధో నక్సల్స్ అని అభివర్ణించటం గమనార్హం.
‘‘సురక్షిత భారతాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సమస్య సరిహద్దు అవతల ఉన్నా.. ఇవతల ఉన్నా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు యుద్ధం రూపురేఖలు మారిపోయాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో స్వీయ అస్త్రశస్త్రాల కోసం పని చేయాలి. సైన్యం సామర్థ్యాన్ని పెంచాలి. అదే సమయంలో పౌరులను సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా సివిల్ డిఫెన్స్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని సంకల్పించాం. రాబోయే రోజుల్లో గతిశీలమైన సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఎర్రకోట వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోదీ
రాజస్థాన్, గుజరాత్‌లలో ప్రసిద్ధి చెందిన ఎర్రని తలపాగా ధరించి ప్రధాని కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వాతంత్య్ర వేడుకల్లో ఈసారి లోక్‌సభ, రాజ్యసభల ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు. దీనిపై భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆ నేతలది మేధో నక్సల్స్ (దిమాగీ నక్సల్స్) ఆలోచనా విధానమని ఈ ఘటనతో స్పష్టమైందని పేర్కొంది. వేడుకలకు హాజరు కావొద్దన్న రాహుల్ నిర్ణయం.. వందేమాతరం గేయంపై ఆయనకున్న వ్యతిరేకతను తెలియజేస్తోందని భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత పదవికి రాహుల్ అనర్హుడని విమర్శించారు. ఎర్రకోటవద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు విపక్ష నేతలు వరుసగా రెండోసారి గైర్హాజరవడం గమనార్హం.
75 నిమిషాల తన ప్రసంగంలో యువత అనే పదాన్ని ప్రధాని 50 సార్లు ప్రస్తావించారు. వికసిత్ భారత్ ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందేది యువతేనని స్పష్టం చేశారు. వారిపై వరాల జల్లు కురిపించారు.
ప్రపంచంలో అగ్ర శ్రేణి దేశాల సరసన నిలిచేందుకు భారత్ తన 7 శక్తిమంతమైన మార్గాలను అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
1. తయారీ, పారిశ్రామిక స్థాయి: విడిభాగాల కూర్పు నుంచి సమగ్ర తయారీ స్థాయికి పారిశ్రామిక రంగం ఎదిగేలా చేయడం.
2. వ్యవసాయం, ఆహార శుద్ధి: భారత వ్యవసాయరంగాన్ని ఎగుమతుల అధికార కేంద్రంగా మార్చడం.
3. టెక్నాలజీ, ఏఐ, డీప్ టెక్: అంతర్జాతీయ టెక్నాలజీ లీడర్‌గా ఎదగడం. యూపీఐలాంటి వ్యవస్థలను అంతర్జాతీయంగా విస్తరించడం. జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్లలో మరింతగా విస్తరించడం.
4. పీఎం గతిశక్తి, మల్టీమోడల్ రవాణా: ఉప ఖండం అంతటా రవాణా సౌకర్యాలను విస్తరించడం. పారిశ్రామిక క్లస్టర్ల మధ్య హైస్పీడ్ రైళ్ల అనుసంధానం పెంచడం.
5. రక్షణ సామర్థ్యం, ఎగుమతుల పెంపు: సైనిక సంపత్తిలో స్వీయసమృద్ధిసాధన.. ఎగుమతుల పెంపు. దేశానికున్న దిగుమతుల ముద్రను తొలగించడం.
6. గ్రీన్, బ్లూ ఆర్థిక వ్యవస్థల విస్తరణ: పర్యావరణ సుస్థిరతను సాధించడం. గ్రీన్ హైడ్రోజన్‌లో పెట్టుబడులు. సముద్ర వనరుల అన్వేషణ కోసం తీర ప్రాంతాల వినియోగం.
7. సాఫ్ట్ పవర్: సాంస్కృతిక దౌత్యం, సృజనాత్మక పరిశ్రమలు, అంతర్జాతీయ విద్యార్థుల మార్పిడి, అంతర్జాతీయ నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకంద్వారా యువశక్తిని వినియోగించుకోవడం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.