© 2026 nimisham.in
తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రవాణా శాఖ, టీజీఎస్ఆర్టీసీ సాధించిన ప్రగతినిప్రభుత్వం వివరించింది. ప్రజా రవాణాను బలోపేతం చేయడంతో పాటు మహిళలు, కార్మికులు, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సంస్థను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లే దిశగా సంస్కరణలు కొనసాగుతున్నాయని పేర్కొంది.ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా.. రూ.12,167 కోట్ల మేర ప్రయాణ ఖర్చు ఆదా చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకం వల్ల మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని వివిధ సర్వేలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.మహాలక్ష్మి పథకం అనంతరం ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ 67 శాతం నుంచి 89 శాతానికి పెరిగిందని మంత్రి వెల్లడించారు. సంస్థలో 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేయగా, 1,024 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్లో మరో 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కూడా నగరంలో ఈవీ బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి రెండు పీఆర్సీలు, ఐదు డీఏలు అమలు చేశామని ప్రస్తుతం పెండింగ్ డీఏలు లేవని మంత్రి తెలిపారు.. 1,424 కారుణ్య నియామకాలు చేపట్టగా సర్వీసు నుంచి తొలగించబడిన 244 మంది ఉద్యోగులను ప్రత్యేక ఐఏఎస్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 4,538 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. 1,000 డ్రైవర్, 743 శ్రామిక పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొత్తగా మరో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా సీసీఎస్ బకాయిలను రూ.1,096 కోట్ల నుంచి
రూ.939 కోట్లకు, పీఎఫ్ బకాయిలను రూ.2,108 కోట్ల నుంచి రూ.1,710 కోట్లకు తగ్గించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలు కూడా రూ.513 కోట్ల నుంచి రూ.485 కోట్లకు తగ్గినట్లు తెలిపారు. తార్నాక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అభివృద్ధి చేయడంతో పాటు బస్స్టేషన్ల ఆధునీకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్లో 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం కొన్ని మార్గాల్లో రాత్రి బస్సులు కూడా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. యూనియన్ ఎన్నికల అనంతరం కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.