© 2026 nimisham.in

Mahabubnagar Minority Gurukul School: చదువుతోనే ప్రతీ ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ముఖ్యంగా సమాజంలో ఒక తరం అభివృద్ధి చెందాలంటే బాలికల విద్య ఎంతో అవసరం. రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో కార్పొరేట్ స్థాయి వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది” అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలో రూ. 20 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల భవనం-1’తో పాటు, రూ. 2 కోట్ల 10 లక్షలతో నిర్మించిన ‘బాలికల వసతి గృహం (హోస్టల్) భవనాన్ని’ శనివారం మంత్రి మహ్మద్ అజారుద్దీన్.. ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో పొందే విద్యా ప్రమాణాలే ఉన్నత విద్యకు బలమైన పునాది అని, గురుకులాల విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమని, గురుకులాలలో నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో మైనారిటీ పాఠశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చొరవతో కేంద్రానికి నివేదికలు పంపి, నిధులు విడుదల చేయించి ఈ భవన
నిర్మాణాన్ని సాధ్యం చేశామన్నారు.
“మాటలతో కాదు – పనితో చూపించడమే మా సిద్ధాంతం. గత రెండున్నరేళ్లలోనే మహబూబ్ నగర్ అభివృద్ధికి రూ. 2,000 కోట్ల నిధులు తీసుకువచ్చాం. త్వరలోనే IIIT, లా, ఇంజనీరింగ్ కళాశాలలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, శాశ్వత తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తి చేస్తాం” అని వెల్లడించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా టాటా వంటి ప్రాజెక్టులతో సుమారు 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, అందులో 25 శాతం మైనారిటీ యువతకు ఆధునిక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా 40 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే బృహత్ ప్రణాళికను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు (MP) డీకే అరుణ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ముస్లింలు సహా అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ మైనారిటీ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) తో పాటు మరికొన్ని అదనపు వసతుల కోసం కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్నగర్లో మరో రెండు మైనారిటీ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలో ఉందని, వాటికి కూడా నిధులు తీసుకువస్తానని చెప్పారు. పాలమూరు ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని డీకే అరుణ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ జి. మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సొసైటీ కార్యదర్శి షపియుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా మధుసూదన్ రెడ్డి, ముడా (MUDA) చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, పారిశ్రామిక ప్రముఖులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Tada Nellore NH 16: తడ–నెల్లూరు హైవేకు 6 లేన్లు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Deputy Director Narahari : అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు..బంగారం చూస్తే మతి పోవాల్సిందే !!
Telangana Rain Alert: రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ
Bhadradri Kothagudem: 2023లో మృతి.. 2024లో వివాహం.. కల్యాణ లక్ష్మి కోసం నకిలీ పెళ్లి పత్రాలు
Sudarshan Reddy: కొత్త ఓటరు నమోదుపై తప్పుడు ప్రచారాలకు చెక్..‘సర్’ ప్రక్రియపై సుదర్శన్ రెడ్డి
Keesara Mother Kills Son: ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి
Mahabubnagar News:అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు