
ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మధ్య ఓ పోరు జరిగింది. ఇందులో మెస్సి విజయం సాధించాడు. ఇంతకీ ఆ పోటీ ఏంటంటారా? 2012లో బార్సిలోనా - మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. బార్సిలోనా తరఫున మెస్సి (Messi) బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ కోసం మెస్సి ధరించిన జెర్సీని తాజాగా వేలం వేశారు. ఆ జెర్సీకి రూ.56 లక్షలు వచ్చాయి. మరోవైపు క్రిస్టియానో రొనాల్డో జెర్సీని కూడా వేలం వేయగా.. కేవలం రూ.9 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ రెండింటినీ మాంచెస్టర్ యునైటెడ్ మసాజ్ థెరపిస్ట్ రాడ్ థోర్న్లే సేకరించి వేలం వేశారు. క్లబ్లో ఆయన సుదీర్ఘకాలంగా పనిచేశారు. గతంలో మాంచెస్టర్తో ఆడిన స్పెయిన్ ఫుట్బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్యూను అడిగి మరీ మెస్సి జెర్సీని రాడ్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘ఆ మ్యాచ్కు కొద్ది రోజుల ముందు గెరార్డ్కు ఓ మెసేజ్ చేశా. నిన్ను ఇంకేమీ అడగను. ఈ ఒక్కసారి నాకు మెస్సి షర్ట్ ఇప్పించు అని అడిగా. మ్యాచ్ ముగిసిన వెంటనే బార్సిలోనా డ్రెస్సింగ్రూమ్కు నన్ను తీసుకెళ్లి మరీ మెస్సి జెర్సీని ఇప్పించాడు. దాని మీద మెస్సి సంతకం చేశాడు. నాకు కరచాలనం కూడా ఇచ్చాడు. ఆ క్షణం అద్భుతమనిపించింది’’ అని రాడ్ తెలిపాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు