
టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనుషులు చేసే ఎన్నో పనులను యంత్రాలు చాలా సులువుగా చేసేస్తున్నాయి. ఇప్పటికే చాలా రంగాల్లో ఉద్యోగాలు ఆటోమేషన్ చేతిలోకి వెళ్లిపోయాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. ఈ AI-generated వీడియోలో, ఒక మహిళ తన చేతిని ప్రత్యేకంగా రూపొందించిన మెషీన్ వద్ద ఉంచింది. ఆ యంత్రం ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఆమె చేతిపై చాలా అందమైన మెహందీ డిజైన్‌ను వేయడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసి అవాక్కయిన హర్ష్ గోయెంకా తన X ఖాతాలో ‘Some more jobs gone’ అంటూ క్యాప్షన్ పెట్టారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో సంప్రదాయంగా మెహందీ వేసే కళాకారుల ఉపాధిపై ఈ ఆటోమేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల సమయం ఆదా కావడంతో పాటు డిజైన్లు చాలా వేగంగా, కచ్చితంగా వస్తాయని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. పెళ్లికి ముందు అంత సున్నితమైన యంత్రంలో చేతులు పెట్టడానికి మహిళలు భయపడతారని, కాబట్టి మెహందీ కళాకారులకు ఎలాంటి ప్రమాదం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే చేతితో వేసే మెహందీలో ఉండే అందం, సహజత్వం, మానవ స్పర్శను ఏ యంత్రమూ భర్తీ చేయలేవని చెబుతున్నారు. ఏదేమైనా, ఆటోమేషన్ కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా రోజువారీ సేవల్లోకి కూడా పాకుతుండటం ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!





