
తల పగిలి ప్రాణాలు కోల్పోయేదాన్నన్న మాజీ సీఎం కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఆ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది నిరసనకారులు ఆమె కారును చుట్టుముట్టి ‘దొంగ.. దొంగ..’ అని నినాదాలు చేశారు. బురద, రాళ్లు, చెప్పులు విసిరారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలీసు కస్టడీలో తమ పార్టీ కార్యకర్త శనివారం ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మమత ఆదివారం హాలిశహర్కు వెళ్లారు. నిరసనకారులు ఆమెను అడ్డుకోవడంతో పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తాను పర్యటనకు వస్తున్నట్లు ముందుగానే తెలియపరిచినా భద్రత ఏర్పాట్లు చేయకపోవడం కుట్ర అని మమత మండిపడ్డారు. ‘భద్రత సంగతి పక్కనపెట్టండి. దుండగులను పోలీసులు రక్షిస్తున్నారు. రాష్ట్రం ఇలాంటివారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు పెడతా. కారుపైకి పెద్దపెద్ద రాళ్లు విసిరారు. నా తల పగిలిపోయి ఇక్కడే ప్రాణాలు కోల్పోయేదాన్ని. భాజపాను పోలీసులు రక్షిస్తున్నారు’ అని ఆరోపించారు. పోలీసులు, మాఫియా శక్తులతో కలిసి ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పారు. మమత కారుపై దాడి ఘటన.. తీవ్ర ప్రజాగ్రహానికి ప్రతీక అని సీఎం సువేందు వ్యాఖ్యానించారు. ఆమె ఎంతో దొంగిలించడం వల్లే ప్రజలు ఆమెను దొంగగా అభివర్ణిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో భాజపా పాత్ర లేదన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు