
అమెరికాలోనూ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి సంక్షేమంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపిఎన్నార్టీ) అమెరికా సౌత్ ఈస్ట్ కోఆర్డినేటర్గా శ్రీ మల్లినేని టాగూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక నియామకపత్రాన్నిజారీ చేసింది. లూసియానా, ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరొలినా, సౌత్ కరొలినా, అలబామా, కెంటకీ, మిసిసిపీ మరియు టెన్నెస్సీ రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల సంక్షేమం కోసం ఆయన కృషి చేయనున్నారు. ఎన్నారైలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి, ఇతర వ్యవహారాల్లో ఇండియన్ ఎంబసీ మరియు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయన సేవలందించనున్నారు. కాగా తనకు ఈ పదవిని అప్పగించడం పట్ల మల్లినేని టాగూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎపి ఎన్నార్టీఎస్ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరుకి, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికాలోని సౌత్ ఈస్ట్ లో ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి, ప్రవాసాంధ్రుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయనకు ఈ పదవి లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. మల్లినేని టాగూర్ తానా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తానా ద్వారా గతంలో ఆయన జన్మభూమిలో పలు సహాయ కార్యక్రమాలను చేశారు