© 2026 nimisham.in
టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’ అనే పేరు తెచ్చుకున్నారు. ఒక్క సినిమా తీయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్న ఈరోజుల్లో.. అనిల్ ఏడాదికో సినిమా చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే, తక్కువ డేట్స్ లో సినిమాని కంప్లీట్ చేయడం ఆయన స్పెషాలిటీ. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే రావిపూడి.. ఒక్కసారి సినిమా పట్టాలెక్కిన తర్వాత షూటింగ్ పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు VenkyAnil5 చిత్రాన్ని కూడా అదే స్పీడుతో పూర్తి చేస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #VenkyAnil5, #NKRAR2 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్నారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడే సినిమా మొదటి భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. ఇప్పటికే ఫస్టాఫ్ ఎలా వచ్చిందో చూసుకున్నారట. ఇది సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట కాదు. సినిమాకి పాటలు రాస్తున్న లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ స్వయంగా చెప్పిన విషయం.అనంత శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘VenkyAnil5’ మూవీ విశేషాలను పంచుకున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గోదావరి జిల్లాల్లోని కుటుంబ నేపథ్యంలో వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సిటీలోని ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చింది. ‘వెంకీ - కళ్యాణ్ రామ్’ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది” అని అనంత శ్రీరామ్ చెప్పారు. 2027 సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే ఫస్టాఫ్ చూసుకున్నామని వెల్లడించారు.‘Venky Anil5’ బావాబామదర్దుల కథ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వెంకటేష్
- కళ్యాణ్ రామ్ బావాబామదర్దులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అనంత శ్రీరామ్ స్పందిస్తూ.. హీరోలు ఇద్దరూ బావా బావా అని పిలుచుకునే స్నేహితులు అని క్లారిటీ ఇచ్చారు. 'వెంకీ - అనిల్ 5' సినిమాని జూన్ 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ మొదలైందని 'రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం'అంటూ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. నెలన్నర తిరక్కుండానే ఫస్టాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిందని చెబుతున్నారు. అనంత్ శ్రీరామ్ ఫస్ట్ షెడ్యూల్ అనబోయి ఫస్టాఫ్ అన్నారేమో తెలియదు కానీ.. అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే ఈజీగా వచ్చే సంక్రాంతికి సినిమా రెడీ అయిపోతుందని అర్థమవుతోంది.ఇక సినిమా షూటింగుతో పాటుగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు అనిల్ రావిపూడి. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన స్టైలే వేరు. మూవీ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి, థియేటర్లలో బొమ్మ పడే వరకూ రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలను ఉపయోగిస్తారు. అందరూ తన సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తారు. ఇప్పుడు ‘వెంకీ - కళ్యాణ్ రామ్’ మూవీ విషయంలోనూ తనదైన పబ్లిసిటీ చేస్తున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టిన రావిపూడి.. ''రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం'' అంటూ ఫన్నీ వీడియోని వదిలారు. సంక్రాంతికి ఇంకా ఐదు నెలల టైమ్ ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో ఎలాంటి కత్తిలాంటి ప్రచార కార్యక్రమాలతో వస్తారో చూడాలి.