
Tribunals Reforms Bill | ఇంటర్నెట్ డెస్క్: ట్రైబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘‘ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026’’కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో వివిధ అంశాలపై విపక్షాలు నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ట్రైబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపతను తీసుకురావడంతో పాటు వాటి పనితీరులో సమర్థతను పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలో ‘‘నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్’’ (National Tribunals Commission) ఏర్పాటవుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించే ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు న్యాయ, ఇద్దరు సాంకేతిక రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కొత్త చట్టం ద్వారా ట్రైబ్యునళ్ల నియామకాలు, అర్హతలు, పదవీకాలం, వేతనాలు, సభ్యుల తొలగింపు తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బిల్లు తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 2021 నాటి ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం రద్దవుతుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు