
Harbhajan Singh | ఇంటర్నెట్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో తన మాటకు విలువ లేకపోవడంతోనే భాజపాలో చేరినట్లు మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆప్‌లో చేరానని.. తన సూచనలు పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో బయటకు రావాల్సి వచ్చిందని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హర్భజన్తోపాటు మరో ఆరుగురు ఆప్ ఎంపీలు భాజపా(BJP)లో చేరిన విషయం తెలిసిందే. ‘‘రాజ్యసభలో ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో క్రీడలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తానని ఆయనతో చెప్పాను. రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశా. పంజాబ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు అవకాశం రావడంతోనే ఆప్‌లో చేరా. కానీ నా ఆలోచనలను ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క సూచననైనా అమలు చేసి ఉంటే పార్టీని వీడేవాడిని కాదు’’ అని హర్భజన్ చెప్పారు. పార్టీని వీడిన తర్వాత ఆప్ తనను విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. తన ఇంటి వద్ద నిరసనలు చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేయడంపై స్పందిస్తూ.. ‘‘నేను ఎవరిని మోసం చేశాను? దేశ ప్రజలు నన్ను క్రికెట్ కారణంగా ప్రేమించారు. పంజాబ్ కోసం మీరు ఏం చేశారో చెప్పాలి. నన్ను ద్రోహి అని పిలిచినంత మాత్రాన నేను ద్రోహిని కాను’’ అని అన్నారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య తీవ్రంగా ఉందని హర్భజన్ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. ఒకప్పుడు క్రీడల్లో పంజాబ్ అగ్రస్థానంలో ఉండేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి ఒకప్పుడు తొమ్మిది మంది హాకీ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ప్రస్తుతం మాదకద్రవ్యాలు విపరీతంగా పెరగడంతో యువత తీవ్రంగా నష్టపోతోందన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు