
ఇంటర్నెట్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజున ఎగువ సభలో గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంటనే కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. అదొక దురదృష్టకర ఘటన అని, అటువంటి కార్యక్రమాలను భాజపా ఏమాత్రం సమర్థించబోదని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. రెండురోజుల తర్వాత ఒక గ్రూప్ అక్కడ శుద్దీకరణ కార్యక్రమం చేపట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గురువారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే.. ఖర్గే ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘‘నేను పాల్గొన్న ర్యాలీలో లక్షల మంది హాజరయ్యారు. నేను ఏ వర్గాన్ని గానీ, మతాన్ని గానీ ప్రస్తావించలేదు. ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడాను. కానీ ప్రసంగం తర్వాత కొందరు ప్రవర్తించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితా..? ఇది భాజపా కార్యకర్తల పనే’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఖర్గేకు మద్దతుగా కాంగ్రెస్ (Congress) ఎంపీలు నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ కలుగజేసుకొని వారికి సర్దిచెప్పారు. ఈ ప్రపంచంలో అంటరానితనానికి మించిన పాపం లేదన్నారు. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదని, వారిని పట్టుకోవాలని ఛైర్మన్ సూచించారు. అయితే, భాజపా కార్యకర్తల పనంటూ ఖర్గే చేసిన ఆరోపణలను జేపీ నడ్డా ఖండించారు. ఆ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘భాజపా చేసిందని పదేపదే చెప్పొద్దు. మా పార్టీ అలాంటి వాటిని ప్రోత్సహించదు. ఆ ఘటనపై దర్యాప్తు జరిపిస్తాం’’ అని హామీ ఇచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత