© 2026 nimisham.in
Khammam Apex Hospital kidney stone : వైద్య రంగంలో మరో అరుదైన అద్భుతం ఖమ్మం నగరంలో ఆవిష్కృతమైంది. పదేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో నరకయాతన అనుభవిస్తున్న ఓ మహిళ కిడ్నీ నుంచి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఏకంగా 800 గ్రాముల బరువున్న భారీ రాయిని విజయవంతంగా బయటకు తీశారు. ముప్పావు కిలో కంటే ఎక్కువ బరువున్న ఇంతటి భారీ పరిమాణపు రాయి కిడ్నీలో పెరగడం, దానిని సురక్షితంగా తొలగించడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ అపెక్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసింది.పదేళ్లపాటు తీవ్ర నరకం..అపెక్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. కిశోర్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన మైలవరపు విజ్జేశ్వరి అనే మహిళ గత పదేళ్లుగా తరచూ కడుపు నొప్పితో బాధ పడుతోంది. స్థానికంగా పలుచోట్ల మందులు వాడినప్పటికీ.. ఆమెకు పెద్దగా ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన ఆమెకు కడుపు నొప్పి ఒక్కసారిగా తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో ఖమ్మంలోని అపెక్స్ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు.ఇదీ చూడండి: యువకుడి పొట్టలో అరకిలో కిడ్నీ స్టోన్.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులుపరీక్షల్లో తేలిన షాకింగ్ నిజం.. ప్రాణాలు కాపాడిన వైద్యుల బృందంఆసుపత్రిలో చేరిన వెంటనే స్పందించిన వైద్యులు విజ్జేశ్వరికి స్కానింగ్ సహా అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలను పరిశీలించిన వైద్యులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆమె కిడ్నీలో సాధారణ పరిమాణం కంటే కొన్ని వందల రెట్లు పెద్దగా ఉన్న ఒక భారీ రాయి ఉన్నట్లు వారు గుర్తించారు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన నిపుణులైన వైద్యుల బృందం అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆ
భారీ రాయిని సురక్షితంగా బయటకు తీసింది. ఆ రాయిని తూకం వేయగా ఏకంగా 800 గ్రాముల బరువు ఉండడం చూసి హాస్పిటల్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు.ఇదీ చూడండి: ఏడాది బాలుడికి కిడ్నీలో రాయి.. ఆపరేషన్ లేకుండా తొలగించిన హైదరాబాద్ డాక్టర్లుఈ అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ ముకుందా బర్మా, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. లలిత, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేశ్, ఆర్థోపెడిక్ డాక్టర్ శివ రాంరెడ్డిలతో కూడిన వైద్యుల బృందం కీలక పాత్ర పోషించింది. శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుందని, పదేళ్ల నాటి నొప్పి నుంచి విముక్తి లభించడంతో విజ్జేశ్వరి కుటుంబ సభ్యులు వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పీఆర్వో కె. శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.