
తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి అత్యంత సున్నితమైన, ప్రభావవంతమైన భూమి అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ‘భూ లక్ష్మి’ పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రచ్చకు తెరలేపింది. ప్రతీ పేద కుటుంబానికి ఎకరం భూమిని పంచుతామని, పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని కవిత చేసిన ప్రతిపాదన కేవలం ఒక సంక్షేమ హామీ మాత్రమే కాదు.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లను ఒకేసారి ఆత్మరక్షణలోకి నెట్టే పక్కా వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర అవతరణ తొలి నాళ్ల వరకు దళితులకు మూడెకరాల భూమి నినాదం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. అయితే, అధికారంలోకి వచ్చాక భూముల లభ్యత లేకపోవడం, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం కొనుగోలు చేయలేక ఆ పథకాన్ని ఆదిలోనే అటకెక్కించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కేవలం రెండు వేల ఎకరాల పంపిణీతోనే ఆ స్కీమ్ ముగిసిపోయింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే క్రమంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కుటుంబానికి రూ. 10 లక్షల పూర్తి సబ్సిడీ ఇచ్చే ‘దళితబంధు’ను తెరపైకి తెచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆ పథకం బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించడమే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధుల కమీషన్ల దందా ఆరోపణలతో బీఆర్ఎస్కు రాజకీయంగా భారీ నష్టాన్నే మిగిల్చింది. గత చేదు అనుభవాలను, వైఫల్యాలను సరిగ్గా అంచనా వేసిన కవిత.. ఈసారి సోషల్ జస్టిస్ పేరిట రీ-డిస్ట్రిబ్యూషన్ అజెండాను చేతుల్లోకి తీసుకున్నారు. గతంలో తాము ఇప్పటికే ప్రకటించిన పాంచజన్యంలోని ఉచిత ప్రైవేటు విద్య, ఉచిత ప్రైవేటు వైద్యం హామీల సాధ్యాసాధ్యాలపై విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్న వేళ, ఈ భూ లక్ష్మి బాంబు పేల్చడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గత పాలకులు చేతులెత్తేసిన అంశాన్ని తాము పక్కా అధ్యయనం, నిపుణులు, మేధావుల మేధోమథనం తర్వాతే