
బెంగళూరు క్రీడలు: స్వేచ్ఛ అంటే కేవలం మనకు నచ్చినట్లు జీవించే హక్కు మాత్రమే కాదు.. దేశం, రాజ్యాంగం, సమాజం భవిష్యత్తు తరాల పట్ల కర్తవ్యం, బాధ్యత అందులో ఇమిడి ఉంటాయని కర్ణాటక శాసనమండలి మాజీ సభ్యుడు, విశ్రాంత ఇండియన్ ఆర్మీ అధికారి కెప్టెన్ గణేష్ కర్ణి తెలిపారు. శనివారం దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని మూఢబిదిరేలోని కె.వి. సుబ్బన్న బయలురంగ మందిరంలో ఆల్వాస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 15వేల మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు, విద్యాసంస్థలకు చెందిన పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ విజయాలు, జాతీయ భద్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, భిన్నత్వంలో ఏకత్వం దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర గురించి మాట్లాడారు. విద్య అనేది కేవలం మార్కులు, డిగ్రీలు లేదా ఉద్యోగాలు పొందేందుకు ఒక సాధనగా ఉండకూడదన్నారు. అది ఒక వ్యక్తిలో వ్యక్తిత్వం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేలా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ విలువలు, సంస్కృతి మూలాలను మరచిపోకూడదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా 2,550 మంది విద్యార్థులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను కలిపి నేలపై జాతీయ జెండా రూపంలో మైదానం చుట్టూ ఒక క్రమబద్ధమైన వరుసలో నిలబడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు