
బెంగళూరు (చిత్రదుర్గం): రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ అదృశ్యమయ్యారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జ్ఞానేంద్రకుమార్ విమానంలో దిల్లీకి బయలుదేరారు. ఆయన మొబైల్ ఫోన్ చివరిసారి దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో స్విచాఫ్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులు కూడా జ్ఞానేంద్రకుమార్ అదృశ్యంపై ఫిర్యాదు చేయలేదన్నారు. జ్ఞానేంద్రకుమార్ గతంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ)లో పరీక్షల కంట్రోలర్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో పశువైద్యాధికారుల నియామకాల్లో రూ.కోట్లు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దానిపై దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోనే మనీలాండరింగ్ ఆరోపణలపై గత నాలుగు రోజులుగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జ్ఞానేంద్రకుమార్ అదృశ్యమయ్యారనే వార్తలు అధికార వర్గాల్లో చర్చలకు దారి తీశాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు