
బొమ్మకల్‌లోని గోపాల్ చెరువు కబ్జాలకు గురికాగా మిగిలి ఉన్న స్థలం నగరాన్ని ఆనుకొని ఉన్న బొమ్మకల్‌లోని గోపాల్ చెరువు 28.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువులోకి గతంలో కరీంనగర్ పట్టణంలోని వరద నీరు చేరుతుండేది. ఆ చెరువు నిండాక నీరంతా మానేరు వాగులోకి ప్రవహిస్తుండేది. అలాంటిది ప్రస్తుతం 80 శాతం వరకు కబ్జా కోరల్లో చిక్కుకుంది. పలు నిర్మాణాలు ఆ ప్రాంతంలో వెలిశాయి. న్యూస్‌టుడే, కరీంనగర్ గ్రామీణం: ఆ ప్రాంతంలో గుంట స్థలం బహిరంగ మార్కెట్లో రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన రూ.కోట్ల విలువైన చెరువును 80 శాతం వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటంతో నగరాన్ని ఆనుకొని ఉన్న విలువైన స్థలం కనుమరుగవుతోంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తమ దృష్టికిరాగానే వెంటనే కూల్చి వేయాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నిర్మాణాలు పూర్తికాగానే సంబంధిత అధికారులు ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ ఇంటి నంబర్లు కేటాయించి అక్రమ నిర్మాణాలను సక్రమం చేస్తున్నారు. దీనికి విద్యుత్తుశాఖ అధికారులు వంతపాడుతూ విద్యుత్తు మీటర్లను అందజేస్తున్నారు. అక్రమ నిర్మాణాలని నోటీసులు జారీ చేసినా ఇంటి పన్ను, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నామని దబాయించే పరిస్థితి ఎదురవుతోంది. చెరువుకు మరోవైపు బఫర్‌జోన్‌లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు సమాచారం. వీటికి అనుమతులుపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులోనూ డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జాయింట్ సర్వే నిర్వహిస్తాం - నర్సింహారావు, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ చెరువును నీటిపారుదలశాఖకు అప్పగించాం. నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ జాయింట్‌గా సర్వే నిర్వహిస్తున్నాం. కబ్జాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. మున్సిపల్, విద్యుత్తుశాఖకు లేఖ రాశాం. ఇంటి నంబర్లు, విద్యుత్తు కనెక్షన్లు క్యాన్సిల్ చేయమని, ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి