
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జీవితంలోని వివాదాస్పద ఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు ప్రచారంలో ఉన్న 'కాలా హిరన్' చిత్ర వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సినిమా టీజర్‌తో పాటు అన్ని ప్రచార సామగ్రిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చిత్ర నిర్మాత అమిత్ జానీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.1998 నాటి కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని, ఇది తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని సల్మాన్ ఖాన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా టీజర్‌లోని ఒక పాత్ర, తాను ధరించే నీలిరంగు బ్రాస్లెట్ను పోలిన ఆభరణాన్ని ధరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 'కాలా హిరన్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ' చిత్ర టీజర్, ప్రచార విజువల్స్, సంబంధిత ఇంటర్వ్యూ లింకులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని పేర్కొంటూ నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సినిమా నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన పిటిషన్లో ఆరోపించారు
.