
జస్టిస్‌ వి.కామేశ్వరరావుతో ప్రమాణం చేయిస్తున్న బిహార్‌ గవర్నర్‌ సయ్యద్‌ హస్నైన్‌ దిల్లీ: తెలుగువారైన జస్టిస్‌ వి.కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బిహార్‌ రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ హస్నైన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరీ తదితరులు హాజరయ్యారు. జస్టిస్‌ కామేశ్వరరావు స్వస్థలం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పొన్నమండ. 1965 ఆగస్టు 7న అమలాపురంలో జన్మించారు. ఉద్యోగరీత్యా తండ్రి వాసుదేవమూర్తి దిల్లీలో స్థిరపడటంతో ఆయన విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1991 మార్చిలో దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకుని న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 2010లో దిల్లీ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 2013 ఏప్రిల్‌ 17న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2015 మార్చి 18న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 జూన్‌ 1న కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఆయన, తర్వాత అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జులై 21న తిరిగి దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.