
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్ సంగతి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సిగ్మా’ చిత్రంతో సంజయ్ మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సిగ్మా సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ జేసన్ సంజయ్, హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లాతో పాటు చిత్ర బృందమంతా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు జేసన్. ఇదే క్రమంలో తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలలంటే తనకు చాలా ఇష్టమని, ఇవి తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని విజయ్ కుమారుడు తెలిపాడు.