© 2026 nimisham.in

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Irumudi Movie Review and Rating: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మరి రవితేజ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకున్నారు..? సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది..? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. త్రినాథ్ రామ కాసు (రవితేజ) అనే రైతు గ్రామంలో తన భార్య, కూతురితో కలిసి జీవిస్తుంటాడు. అతను అయ్యప్ప స్వామికి భక్తుడు. తాగుడుకు అలవాటు ఉన్నప్పటికీ కూతురంటే ఎంతో ప్రేమ. తన కూతురు రోజంతా ఏం జరిగిందో తనతో చెప్పాలని తండ్రిగా ప్రోత్సహిస్తాడు. గ్రామంలోని ప్రతి అమ్మాయిని కూడా తన కూతురిలాగే భావించే త్రినాథ్ వారికి అండగా నిలుస్తాడు. అయితే గ్రామంలో అమ్మాయిలకు ఎదురవుతున్న సమస్యలు, వేధింపులు, హత్యలు అతని కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఈ సమస్యల వెనుక ఉన్నది ఎవరు? అమ్మాయిలను ఎవరు భయపెడుతున్నారు..? త్రినాథ్ వారిని ఎలా కాపాడాడు..? అనేదే సినిమా కథ. రవితేజ ఈ సినిమాలో చాలా సీరియస్‌గా, సహజంగా నటించారు. సాధారణంగా కనిపించే మాస్ హీరో ఇమేజ్ను పక్కన పెట్టి మంచి నటనను చూపించారు. తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. బేబీ నక్షత్ర సినిమాకు ప్రధాన బలం. కూతురు పాత్రలో ఆమె చాలా సహజంగా నటించింది. ప్రియా భవానీ శంకర్ కూడా భార్య పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలోని కీలక సన్నివేశంలో ఆమె నటన బాగా
ఆకట్టుకుంటుంది. సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయికుమార్‌కు ఇచ్చిన పాత్రలోని భిన్నమైన షేడ్స్‌ను ఆయన చక్కగా చూపించారు.
జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఉత్కంఠ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో బీజీఎం ప్రభావం కనిపిస్తుంది. అయ్యప్ప స్వామికి సంబంధించిన రెండు పాటలు తెరపై బాగా ఆకట్టుకుంటాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ తొలి భాగంలో బాగుంది. రెండో భాగంలో ఇంకాస్త కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా సాగేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
‘ఇరుముడి’లో ప్రధానంగా ఇద్దరు తండ్రుల ఆలోచనా విధానాలను చూపించారు. అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని భయపడుతూ ఆమెనే సర్దుకుపోవాలని చెప్పే తండ్రి ఒక వైపు ఉంటే, ఏ సమస్య వచ్చినా తనతో చెప్పాలని, ధైర్యంగా ఉండాలని కూతురికి చెప్పే తండ్రి మరోవైపు ఉంటాడు.
అమ్మాయిలను భయంతో పెంచడం కంటే ధైర్యంగా, స్వతంత్రంగా ఉండేలా పెంచాలని సినిమా చెబుతుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు శివ నిర్వాణ చాలా వరకు ఆసక్తికరంగా తెరకెక్కించారు. తొలి భాగంలో తండ్రి, కూతురి అనుబంధం, గ్రామంలోని అమ్మాయిల సమస్యలు, వారి చుట్టూ ఉన్న ప్రమాదాలతో మంచి ఉత్కంఠను క్రియేట్ చేశారు. అసలు సమస్య వెనుక ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కొనసాగుతుంది. ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.
అయితే ట్విస్ట్ తర్వాత కథ కొంత ఊహించదగిన విధంగా మారుతుంది. కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా బాధ కలిగించేలా ఉన్నాయి. అయితే సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను చూపించడంలో అవి కథకు ఉపయోగపడ్డాయి. క్లైమాక్స్ మాత్రం భావోద్వేగంగా ఉంటుంది.
సామాజిక అంశాన్ని ఫ్యామిలీ ఎమోషన్, థ్రిల్లర్, యాక్షన్‌తో కలిపి చెప్పిన సినిమా ‘ఇరుముడి’. రవితేజ నటన, బేబీ నక్షత్ర పర్ఫామెన్స్, బలమైన కథ, మంచి బీజీఎం సినిమాకు ప్రధాన బలాలు. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు ఊహించదగినవిగా ఉన్నప్పటికీ, సినిమా చెప్పే సందేశం బలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచించేలా చేసే సినిమా ఇది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.