
Chhattisgarh | ఇంటర్నెట్ డెస్క్: సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చిందని బాధపడిన వ్యక్తి.. ఉద్యోగం సాధించాక రూ.కోటి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్ (Rahul Bansal)పై ఈ ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి చేరింది. ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత రాహుల్ బన్సాల్ ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో సీఎస్పీగా విధుల్లో చేరారు. ఆ సమయంలో ఓ సైబర్ నేరానికి సంబంధించిన సెటిల్మెంట్లో భాగంగా ఆయన రూ.కోటి లంచం తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. రెండు దఫాలు ఈ మొత్తాన్ని ఆయనకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాట్సప్ రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను వారు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ పోలీసులను ఆదేశించింది. కాగా.. సివిల్ సర్వీసెస్‌లో చేరకముందు రాహుల్ ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘నా సోదరుడు అమెరికా వెళ్లేందుకు జనన ధ్రువీకరణ పత్రం అత్యవసరంగా అవసరమైంది. దాన్ని త్వరగా ఇచ్చేందుకు పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగారు. ఆ మొత్తం చెల్లించడం నాకు చాలా బాధగా అనిపించింది’’ అని బన్సాల్ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. అదే ఇంటర్వ్యూలో అవినీతి, అసమర్థతపై బన్సాల్ మాట్లాడారు. కొందరు అధికారులు చేసే తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఇప్పుడు ఆయనపై రూ.కోటి లంచం ఆరోపణలు రావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, రాహుల్‌పై వచ్చిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు