గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఐపీఎస్ అధికారి కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఏటుకూరు బైపాస్ రోడ్డులో లారీ, కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో మహిళా ఐపీఎస్ షిరిన్ బేగం కుమార్తె ఆసిఫా మృతి చెందారు. షిరిన్ బేగం ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. ఆదివారం కావటంతో షిరిన్ బేగం కుమార్తె ఆసిఫా తన స్నేహితులతో కలిసి కారులో సూర్యలంక బీచ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారులో వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆసిఫాకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడున్న వారు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆసిఫా చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధరించారు. ఓ రేషన్ సరఫరా లారీ, కారు ఢీకొన్నట్లు తెలిసింది.ఈ ప్రమాద ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కుమార్తెకు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని షిరిన్ బేగం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రమాదంలో ఆసిఫా చనిపోయిందని వైద్యులు చెప్పటంతో కుమార్తె మరణవార్తను తట్టుకోలేక భోరున విలపిస్తూ స్పృహతప్పి పడిపోయారు. ఈ దృశ్యం ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులను కలిచి వేసింది. మరోవైపు ట్రాఫిక్ డీసీపీగా ఉన్న షిరిన్ బేగం హెల్మెట్ వాడకం, ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులు, ఆటోడ్రైవర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.టాక్టికల్ అర్బనిజం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పిస్తుంటారు. అన్ని స్కూలు బస్సులు కచ్చితంగా నిబంధనలు అనుసరించేలా చూడటంతో పాటు, రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతుంటారు. సేఫ్ రైడింగ్ గురించి వాహనదారులకు అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతుంటారు. అలాంటి ట్రాఫిక్ డీసీపీ కుమార్తె.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విధి ఆడిన నాటకమని ఈ విషయం తెలిసిన స్థానికులు అభిప్రాయపడుతున్నారు