iPhone EMI Family Tragedy : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కొండపైకి ఎక్కిన కొడుకు చనిపోతానంటూ రచ్చ చేయడంతో.. కాపాడేందుకు వెళ్లి తండ్రి సైతం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కొడుకు, భర్త చనిపోవడం చూడలేక మహిళ కూడా కొండ పైనుంచి దూకి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మృతికి కారణం.. ఐఫోన్ ఈఎమ్ఐ కట్టే విషయంలో గొడవలు తలెత్తడమేనని తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శంభాజీనగర్‌లోని తిస్గావ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ అనే యువకుడు ఇటీవల ఎంతో ఇష్టపడి ఓ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే ఆ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ వాయిదాలు చెల్లించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంట్లో తండ్రి మురళీధర్ చాంద్గుడేను డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే ఈఎంఐ చెల్లింపుపై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్.. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చి, వాలూజ్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు.కొడుకు కొండపైకి వెళ్లడం గమనించిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీత వెంటనే అతడిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్ సంజయ్ జాధవ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు కూడా కొండ వద్దకు చేరుకుని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. "నీకు ఐఫోన్ 15 ప్రో కూడా కొనిస్తాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ తల్లి కోసం అయినా కిందకు దిగి రా" అని దాదాపు మూడు గంటల పాటు అక్కడున్న వారంతా వేడుకున్నారు. అయినా కునాల్ మాత్రం "చావడమే నాకు ఉన్న ఏకైక మార్గం" అని భీష్మించుకూర్చున్నాడు.క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..!మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పరిస్థితి చేయిదాటిపోతుండటంతో.. తండ్రి మురళీధర్ ధైర్యం చేసి కునాల్ నిలబడి ఉన్న కొండ అంచుకు చేరుకున్నాడు. కుమారుడిని వెనక్కి లాగి కాపాడేందుకు ప్రయత్నించగా.. ఊహించని విధంగా ఇద్దరూ అదుపుతప్పి కొండ అంచు నుంచి లోయలోకి పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కొండపై నుంచి కిందపడిపోవడం చూసిన తల్లి సంగీత తట్టుకోలేకపోయింది. క్షణాల వ్యవధిలోనే ఆమె కూడా కొండపై నుంచి కిందకు దూకేసింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గొడవంతా జరుగుతుండగా.. అక్కడున్న కొందరు వీడియో తీసి నెట్టింట పెట్టగా.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.




