
భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన యువతకు అతి సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఇప్పుడు వచ్చేసింది. కొత్తగా విడుదలైన 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' (India Skills Report 2026) ప్రకారం, ఉద్యోగం సాధించే నైపుణ్యాలు, అర్హతలు ఉన్న వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నేటి జాబ్ మార్కెట్కు కావలసిన నైపుణ్యాలు, సంసిద్ధతలో యూపీ యువత అందరికంటే ముందున్నారని రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో యువత ఉద్యోగార్హత గణనీయంగా పెరిగింది. 2025లో ఈ రేటు 54.81 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 56.35 శాతానికి చేరింది. అంటే మారుతున్న కార్పొరేట్ రంగానికి, కొత్త రకాల జాబ్స్ కోసం మన దేశ యూత్ మునుపటి కంటే చాలా వేగంగా అప్గ్రేడ్ అవుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రిపోర్టును ఈటీఎస్ (ETS) సంస్థ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఇతర ప్రముఖ సంస్థలతో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. ఇందులో భాగంగా లక్షకు పైగా అభ్యర్థులు రాసిన 'గ్లోబల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్' (GET) ప్రతిభను విశ్లేషించారు. దాంతో పాటు 7 ప్రధాన రంగాలకు చెందిన 1,000 కంటే ఎక్కువ కంపెనీల అభిప్రాయాలు, సమాచారాన్ని సేకరించి ఈ రిపోర్టును రూపొందించారు. రాష్ట్రాల వారీగా ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వరుసగా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్టులో టాప్ 10 లో ఏపీ, తెలంగాణలు లేవు. కానీ, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వంటి జాతీయ స్థాయి నైపుణ్య సర్వేల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమ ప్రతిభను చాటుకున్నాయి. 18