
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్ సుతార్ ఫైఫర్ (6/55) నమోదు చేశాడు. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారనప్పటికీ.. పర్సంటేజీని మాత్రం బాగా పెంచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి.
యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మరోసారి అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో (76వ) మూడు వికెట్లు తీశాడు. సోనాల్ దినుష (84), ప్రభాత్ జయసూర్య (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అతడు.. ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. సోనాల్ క్యాచ్‌ను స్లిప్‌లో ధ్రువ్ జురెల్ అందుకొన్నాడు. ప్రభాత్ జయసూర్య బౌల్డ్ అయ్యాడు. ఇక లాహిరు ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ పంత్ అందుకొన్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 199/9.
శ్రీలంక బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండా పట్టుదల ప్రదర్శిస్తున్నారు. భారత బౌలర్లు మాత్రం శతవిధాలా ఏడో వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆరు ఓవర్లపాటు ఆట జరిగింది. కేశర నువాంత (12*), సోనాల్ దినుష (80*) మాత్రం డిఫెన్స్ ఆడేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 72 ఓవర్లకు 194/6. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉండగా.. శ్రీలంకకు 177 పరుగులు అవసరం.
శ్రీలంక - భారత్ తొలి టెస్టు ఐదో రోజు మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజ్‌లో సోనాల్ దినుష (65*), కేశర నువాంత (8*) ఉన్నారు. ఈ సెషన్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీయగలిగారు. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (59)తోపాటు నిరోషన్ డిక్వెల్లా (10) పెవిలియన్‌కు చేరారు. మరో నాలుగు వికెట్లు తీస్తే టీమ్ఇండియాదే టెస్టు విజయం. మరోవైపు శ్రీలంకకు 197 పరుగులు అవసరం.
శ్రీలంకకు స్వల్ప వ్యవధిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా (10) పెవిలియన్‌కు చేరాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన (59.6వ ఓవర్) బంతిని షాట్ కొట్టే క్రమంలో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 156 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 61 ఓవర్లకు 160/6. క్రీజ్‌లో కేశర (1*), సోనాల్ దినుష (57*) ఉన్నారు. మరో నాలుగు వికెట్లు తీస్తే టీమ్ఇండియాదే విజయం.
దాదాపు 24 ఓవర్ల తర్వాత భారత్‌కు వికెట్ దక్కింది. కెప్టెన్ ధనంజయ (59)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన (55.2వ ఓవర్) బంతిని ఆడేందుకు ప్రయత్నించి మానవ్ సుతార్‌కు ధనంజయ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 95 పరుగులు ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 56 ఓవర్లకు 144/5. క్రీజ్‌లో సోనాల్ (51*), డిక్వెల్లా (1*) ఉన్నారు. శ్రీలంక విజయానికి 228 పరుగులు అవసరం. భారత్ ఐదు వికెట్లు తీస్తే గెలుస్తుంది.
శ్రీలంక - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్‌నైట్ 84/4 స్కోరుతో శ్రీలంక ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టింది. కెప్టెన్ ధనంజయ (54*), సోనాల్ దినుష (50*) హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 91 పరుగులు జోడించారు. వికెట్ కోసం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 51 ఓవర్లకు 138/4. లంక విజయానికి ఇంకా 234 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు ఆరు వికెట్లు కావాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





