
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.ఆనాడు దేశ సార్వభౌమత్వాన్ని చాటుతూ ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణ పతాకం,నేడు కూడా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని,గర్వాన్ని రగిలిస్తోంది.ఈ మహోజ్వల సంబరాలకు ముందు రోజు,అంటే ఆగస్టు 14న దేశ విభజన నాటి దారుణాలను గుర్తుచేసుకునే విభజన భీభత్స స్మృతి దినంగా పాటిస్తాం.స్వాతంత్ర్య సంబరాల వెనుక ఎందరో అమాయక ప్రాణాల బలిదానాలు,కుటుంబాల విడిపోయిన వేదన దాగి ఉన్నాయి.ఆ చేదు జ్ఞాపకాలను స్మరిస్తూనే,సాధించుకున్న స్వేచ్ఛ విలువను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి హృదయం ఆకాంక్షిస్తుంది.1947లో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన ఈ పతాకావిష్కరణ సాంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది.ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు,నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతి పౌరుడు శపథం పూనే పవిత్రమైన సమయం.భరతమాత స్వేచ్ఛా ప్రస్థానం తరతరాల త్యాగాల పునాదులపై నిర్మితమైందని మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.ఈ నేపథ్యంలో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిలు కూడా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం